11, సెప్టెంబర్ 2016, ఆదివారం

|| కుసుమ ధర్మన్న ఈ కాలానికీ అవసరం .. ||

                                                    


              'మాకొద్దీ నల్ల దొరతనం' అంటూ గర్జించిన కుసుమ ధర్మన్న కవీంద్రుని గేయ సంపుటి నేటికీ చిరస్మరణీయం. ఇందులోని ప్రతి కవితలో దళితుల ఆక్రందన, ఆవేదన వ్యక్తమవుతాయి. ఎందుకు మమ్మల్ని అస్పృశ్యులుగా చూస్తున్నారు? వెలివేస్తున్నారు? దూరం పెడుతున్నారు? ఏం పాపం చేసింది మా జాతి? అంటూ ప్రశ్నించిన తీరు ఆ కాలానికే కాదు ఈ కాలానికీ సరిపోతుంది.
కుసుమ ధర్మన్న కవి.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యుడు. 1900 సంవత్సరంలో జన్మించాడు. 1921లో ఈ కవితా సంపుటిని ప్రచురించారు. మాకొద్దీ తెల్లదొరతనం అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన గేయానికి ప్రతిగా మాకొద్దీ నల్లదొరతనం అంటూ ధర్మన్న కవి రాసిన పదకవితకు తెలుగు నేలంతా ప్రతిధ్వనించింది. నాడు విద్యావంతులైన దళితులనే కాదు, దళితేతర ప్రజాస్వామిక వాదుల్ని కూడా ఆలోచింపచేసింది. ప్రముఖ రచయిత సివి దృష్టిలో- ధర్మన్న కవి తొలి తెలుగు ప్రజా వాగ్గేయ కారుడు. దళిత ఉద్యమ వైతాళికుడుగా మరికొందరు ఆయన్ను గురించి అభివర్ణించారు. కాని తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన పేరు వినిపించదు. సాహిత్యరంగంలో సైతం వివక్ష ఉందనడానికిది నిదర్శనం. ఇంతటి గొప్ప కవి, సంస్కర్త, పోరాటయోధుడి గురించి తాజాగా వెలువడిన గ్రంధాలు అపార సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటితో పాటు హరిజన శతకం, నిమ్నజాతుల విముక్తి తరంగిణి, మద్యపాన నిషేధం, అసుర పురాణం వంటి ప్రసిద్ధ గ్రంథాలను కూడా రాశారు. జయభేరి పత్రికకు సంపాదకులు కూడా. ఆనాడు తెలుగు గడ్డ మీద చదువుకొన్న అతి కొద్ది మంది దళితుల్లో ధర్మన్న కవి ఒకరు. చిన్నతనం నుండే తాను ఎదుర్కొన్న వివక్షతను, అనుభవించిన అవమానాలను స్వీయానుభవంతో వర్ణించి రచించిన కవితలివి. అంబేద్కర్‌ భావజాలంతో ప్రభావితుడై, తెలుగు గడ్డ మీద ప్రచారం చేసిన తొలి మేథావి. 
స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామయ్యాడు. విద్యార్థి దశలోనే ఖద్దరు ధరించి గాంధీ శిష్యుడనిపించుకున్నాడు. అయినా సామాజిక సమస్యలపై కాంగ్రెస్‌ నాయకులతోనే ఘర్షణ పడ్డాడు. అప్పటి తెల్లదొరలు (బ్రిటిష్‌వారు) దేశాన్ని పీడిస్తున్నా దళితుల పట్ల అంటరానితనం పాటించలేదు. పైగా వారిని తమ దేవాలయాలైన చర్చిలలోకి ఆహ్వానించారు, వారిని మనుషులుగా చూశారు. కాని వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్య్రోద్యమ నాయకులు, అగ్రకుల భూస్వామ్య పెత్తందారీ కుటుంబాల నుంచి వచ్చినవారు దళితులని అణగదొక్కుతున్నారు. తెల్లదొరలైన బ్రిటీష్‌వారు వెళ్లిపోయి ఈ నల్లదొరలు అధికారంలోకి వస్తే.. దళితుల నెత్తిమీద కూర్చొని మరింతగా అణగదొక్కుతారు. వాళ్లకు స్వేచ్ఛనివ్వరు. కట్టడి చేస్తారు. 'అందుకే అలాంటి పెత్తందారుల పెత్తనం మాకొద్దు. సమసమాజ భావనతో మనిషిని మనిషిగా గౌరవించే సమాజం మాకు కావాలి.' అంటూ నినదించారు ధర్మన్న కవి. 
1930వ దశకంలో గాంధీ హరిజన సమస్యపై మాట్లాడటానికి రాజమండ్రి వచ్చాడు. నాయకులందరినీ పిలిచారు. అప్పటికే ధర్మన్న కవి రాజమండ్రి కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఉన్నాడు. అయినా ఆయన ఆ సభకు వెళ్లలేదు. గాంధీకి ఉత్తరం రాసి పంపాడు. 'నువ్వు నిజంగా హరిజన సమస్య గురించే వస్తే మా దగ్గరికి వచ్చి మాట్లాడాలని' కోరడమే కాదు; రప్పించుకున్నారు కూడా. అదీ ధర్మన్న పట్టుదల. అలా ధర్మన్న కవి తన రచనల ద్వారానే కాక రాజకీయంగా కూడా వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాటం సాగించాడు. అప్పటికి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రవేశించనే లేదు. కాని సామ్యవాద భావాల ప్రభావం ఆయనపై కూడా ఉందనడానికి ఆయన రచనలే సాక్ష్యం. 
ఆనాడు ధర్మన్న కవి ఏఏ సమస్యలనైతే ఎత్తిచూపాడో అవి ఈ రోజుకు కూడా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం వచ్చిన రిజర్వేషన్ల హక్కుతో కొద్దిమంది దళితులు చదువుకున్నా, ఉద్యోగాల్లో స్థిరపడ్డా, అత్యధికులు ఇంకా నిరక్షరాస్యులుగా మారుమూల గ్రామాల్లో మగ్గుతూనే ఉన్నారు. వారి పిల్లలు అందరితో పాటు సమానంగా నాణ్యత కలిగిన చదువుకు నోచుకోలేదు. ప్రైవేటీకరణ విధానాల వల్ల కార్పొరేట్‌ విద్యా సంస్థలు విస్తరించాయి. అక్కడికి పోయే తాహతు అందరికీ లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. ఈ బడుల్లో అత్యధిక మంది దళిత బడుగు బలహీన వర్గాల వారే చదువుకుంటున్నారు. ఈ పోటీ ప్రపంచంలో వారు ఎలా నెగ్గుకురాగలరు? సంక్షేమ, గురుకుల పాఠశాలలు ద్వారా కొద్దిమంది పైకి చేరుకున్నా ఎన్నో కుసుమాలు మధ్యలోనే రాలిపోతున్నాయి. 
ఉమ్మడి రాష్ట్రంలో కెవిపిఎస్‌ నిర్వహించిన సర్వేలు 149 రకాల వివక్ష రూపాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, క్షవరాలు చేయకపోవడం, బట్టలు ఉతక్కపోవడం, దోసిళ్లతో తాగేనీరు పోయడం, భోజనాలకు ప్రత్యేకంగా కంచాలు, పెళ్ళిళ్లలో, ఉత్సవాల్లో ఈసడింపులు, దేవుడి దర్శనాలకు అనుమతించకపోవడం, సైకిళ్లపై ప్రధాన వీధుల్లో తిరగనివ్వకపోవడం, పేర్లు పెట్టకుండా ఒరేరు, ఒసేరు అంటూ పిలవడం వంటి లెక్కకు మించిన వివక్షతలు అనేక గ్రామాల్లో ఇప్పటికీ అమలవుతూనే ఉన్నాయి. గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలసపోతే అక్కడా వివక్ష తప్పడం లేదు. ఇండ్లు అద్దెకు ఇవ్వకపోవడం, ఇరుగుపొరుగు ఉత్సవాలకు పిలవకుండా ఉండటం వంటి అవమానాలెన్నో ఎదుర్కొంటున్నారు. ఉన్నతోద్యోగాలలో ఉన్నా.. అంతకన్నా కింద ఉండే అగ్రకుల ఉద్యోగులు వారిని లెక్కచేయరు. అనర్హులు పైకి వచ్చారంటూ కళ్లు ఉరుముతారు. ఉన్నత విద్యావంతులు సైతం ఆత్మగౌరవం కోసం అడుగడుగునా పోరాడాల్సి వస్తుంది. 
విద్యావంతులై ఆర్థికంగా ఎంతో కొంత నిలదొక్కుకున్నవారు ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తూంటే సహించలేని దుష్టత్వం అగ్రకులాల్లో కనిపిస్తుంది. ఏదో ఒక నెపంతో ఘర్షణ పడి భౌతిక దాడులకు దిగడం, దళిత వాడలను తగలపెట్టడం, సామాజిక బహిష్కరణకు గురిచేయడం, ఇప్పటికీ నాగరిక సమాజానికి సవాలుగానే నిలుస్తున్నది. నాటి పదిరి కుప్పం మొదలుకొని కారంచేడు, చుండూరు, లక్షింపేట మీదుగా తాజా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, గుజరాత్‌ ఊనా, అమలాపురం ఘటన వరకు అదే చరిత్ర పునరావృతమవుతుంది. ఆవు చర్మం వొలుస్తున్నారన్న పేరుతో దళిత యువకులని, బహిరంగంగా కొట్టుకుంటూ నడివీధిలో తిప్పిన వైనం రాజ్యాంగానికి మాత్రమే సవాలు కాదు, సభ్య సమాజాన్ని తలదించుకునేటట్లు చేస్తుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇన్‌క్ల్యూజివ్‌ (తమలో ఇముడ్చుకునే) విధానాల పేరుతో కొందరిని పెట్టుబడిదారులను చేసినా, రాజకీయంగా పార్టీలలో కొన్ని పదవులు ఇచ్చినా, మంత్రి పదవులు కట్టపెట్టినా అలాంటి వారందరినీ తమకు దిగువన ఉన్న సబార్డినేట్లుగానే చూస్తున్నారు. దోపిడి వర్గాల పల్లకీలను మోయడానికి వీరిని బోయలుగానే వాడుతున్నారు.
సరళీకృత ఆర్థికవిధానాలు వచ్చాక గత పాతికేళ్లలో సంపద పెరిగింది. అభివృద్ది జరిగింది. కానీ ఆ ఫలాలు కొద్దిమందికే పోతున్నాయి. అంబానీలు, అదానీలు కోట్లకు పడగలెత్తుతుంటే... సామాన్యుల దుస్థితి పాతాళంలోకి పోతుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో దళితుల భూములు గుంజుకుంటున్నారు. 1970లలో భూసంస్కరణల పేరుతో పంచిన పనికిరాని భూములను కూడా ఇప్పటి ప్రభుత్వాలు తమవే అంటూ ఎలాంటి ప్రతిఫలం ముట్టచెప్పకుండా ప్రజల నుంచి లాగేసుకుంటున్నారు. భూమి అస్తి మాత్రమే కాదు ఆత్మ గౌరవం కూడా. 
మోడీ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో కులవివక్ష మరింత పెట్రేగిపోతోంది. 'మనువాదమే ఆధునిక రాజ్యాంగం' అనుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు గో రక్షణ సమితుల పేరుతో దళితులపై దాడులకు దిగడం సాధారణం అయిపోయింది. సంవత్సరం క్రితం దాద్రీలో మొదలై తాజాగా అమలాపురం వరకు కొనసాగుతున్నా ప్రధాని మాత్రం నోరువిప్పరు. అదేమని అడిగితే ప్రతిదానిపై ప్రధాని స్పందించాలా అంటారు. ఘటన జరిగినప్పుడు స్పందించని ప్రధాని నెల తర్వాత ఏమీ జరగకపోయినా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎన్నికల రాబోతున్నాయి. కనుక అక్కడ దళితుల ఓట్లు కావాలి కాబట్టి ఆయన నోరు విప్పారు. నోరు విప్పారే తప్ప దోషులపై చర్యలకు దిగలేదు. ప్రధాని ఖండించిన రెండు రోజుల్లోనే అమలాపురం దగ్గర ఉనా లాంటి ఘటన పునరావృతమైంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూడా హిందుత్వను స్వీకరించిందన్నట్లుగా వ్యవహరిస్తున్నది. మత భావాలను ప్రేరేపించి రాజకీయంగా బలపడాలని తెలుగుదేశం లాంటి సెక్యులర్‌ పార్టీలు కూడా ప్రయత్నించడం పెరుగుతున్న ప్రమాదానికి సంకేతం. ఇలాంటి ఘటనల్లో అధికార యంత్రాంగం, పోలీసు, న్యాయవ్యవస్థ కూడా వివక్షతా పూర్వకంగానే వ్యవహరిస్తున్నాయి. ఫ్యూడల్‌ భావజాలం కలిగిన అగ్రకుల ఉన్నతాధికారులు కొందరు నిందితులను కూడా వెనకేసుకువస్తున్నారు. ఈ రోజు రక్షణ కావాల్సింది మనుషులకు. గో రక్షణ పేరుతో దాదులకు గురవుతున్న మనుషులకు, ఆవుల పేరుతో చంపుతున్న దళితులకు రక్షణ కావాలి. దాని కోసం పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. 
నిచ్చెన మెట్లలాంటి ఈ కులవ్యవస్థను ఎలా విధ్యంసం చేయాలన్న దానిపై చాలా విధాలుగా చర్చ నడుస్తున్నది. మధ్య యుగాల్లో భక్తి ఉద్యమం కులవ్యవస్థపై కత్తికట్టింది. అయినా అది రూపు మాసిపోలేదు. నాటి పాలకుల అండే దానికి కారణం. దానికి మూలమైన వ్యవస్థ రూపాంతరం చెందినా కులవ్యవస్థ కూడా కొత్త వ్యవస్థలో ఇమిడిపోతున్నది. బ్రిటీష్‌వారు కుల వ్యవస్థను అమలు చేయకపోయినా దాని కొనసాగింపుకు సహకరించారు. కులాంతరాలను తమ రాజకీయ ఉనికి కోసం ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో కుల నిర్మూలన ఒక అంతర్భాగంగా నడిచినా స్వాతంత్య్రనంతరం కూడా అది మరో రూపంలో కొనసాగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం కులవ్యవస్థను తనలో ఇముడ్చుకొని ఉపయోగించుకుంటోంది. కుల నిర్మూలన కోసం జ్యోతిబాపులే మొదలుకొని అంబేద్కర్‌, కమ్యునిస్టుల వరకు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. 1980, 90 దశకాల్లో వచ్చిన నూతన మార్పుల్ని, సామాజిక పరిణామాలను, దళితులు, ఆదివాసీలు, మహిళల్లో వస్తున్న ప్రజాస్వామిక చైతన్యాన్ని సకాలంలో అందుకొని జోక్యం చేసుకోవడంలో కమ్యూనిస్టు ఉద్యమం వెనుకబడిన మాట వాస్తవం. తిరిగి 90వ దశకం ఆఖరులో, 21వ శతాబ్దపు ఆరంభం నుండి చురుకైన పాత్రను కమ్యూనిస్టు ఉద్యమం పోషిస్తోంది. సరళీకరణ ఆర్థిక సంస్కరణలు వచ్చాక అస్తిత్వ రాజకీయాల పేరుతో ప్రజలను కులాలు, ఉప కులాలుగా చీల్చి ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అంబేద్కర్‌ కుల నిర్మూలన కోసం పోరాడితే అంబేద్కర్‌ పేరుతో నేడు కొందరు కుల ఉనికి కోసం పోరాడుతున్నారు. అస్తిత్వ రాజకీయాలు, కుల నిర్మూలనకు తోడ్పడవు. కుల వ్యవస్థను కొనసాగించడానికే అవి తోడ్పడుతున్నాయి. పాలకుల దాయాదాక్షిణ్యాలపై నడిచే అలాంటి రాజకీయాలు కుల నిర్మూలనకు ఏ రకంగానూ ఉపయోగపడవు. కుల వ్యవస్థను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోవాలంటే దానికి వర్గ దృక్పథమే శరణ్యం. వర్గ దృక్పథం లేని కుల విశ్లేషణ కుల నిర్మూలన అనే లక్ష్యానికి విరుద్ధంగా నడిపిస్తుంది. కమ్యునిస్టులు కుల వివక్షను అర్థం చేసుకోలేదని నిందించేవాళ్లు పరోక్షంగా కులవ్యవస్థను కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నారు. మన అనుభవం పరిశీలిస్తే ఎక్కడ కమ్యునిస్టు ఉద్యమం బలంగా ఉందో అక్కడ కులపీడన తక్కువగా ఉంది. అక్కడ దళితులపై, మహిళలపై, సామాజిక తరగతులపై దాడులు తక్కువగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రోద్యమంలో ఎకె గోపాలన్‌, సుందరయ్య, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ లాంటి వారు కుల వివక్షపై కత్తికట్టి పోరాడారు. కమ్యూనిస్టు కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం ఈ 70 ఏళ్లలో అనేక ఉద్యమాలు వచ్చాయి. అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. పాలకులు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అయినా కులవ్యవస్థ తగ్గలేదు. కుల నిర్మూలన జరగలేదు. జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ పుట్టిన మరాఠా గడ్డ, బిఎస్‌పి బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లలో కూడా వివక్షత, అత్యాచారాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి అదికారంలో ఉన్న రాష్ట్రాలలో వీటికి అంతే లేదు. కానీ కమ్యునిస్టులు బలంగా ఉన్న కేరళ, త్రిపుర, బెంగాల్‌లలో అంటరానితనం లేదు. దేశంలో ఏ రాష్ట్రంతో పొల్చుకున్నా ఇక్కడ అత్యాచారాలు తక్కువ. అలాగే ఇతర చోట్ల కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో పెత్తందార్ల ఆగడాలకు బ్రేక్‌ పడింది. ఈ వాస్తవాలే కమ్యూనిస్టుల ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి.
కుసుమ ధర్మన్న కవి కుల వ్యవస్థలేని సమ సమాజాన్ని కోరుకున్నాడు. అందుకోసం తన యావత్‌ జీవితం పోరాడాడు. నేటికీ ఆ కర్తవ్యం అసంపూర్ణంగానే ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదులందరిపై ఉంది. ఈ ఆశయ సాధనలో కమ్యూనిస్టులకు అంబేద్కరిస్టులు తోడవ్వాలి. కుల అస్తిత్వం కోసం కాక కులనిర్మూలన కోసం ఉద్యమాలు నడవాలి. ధర్మన్న కవితలు, పద్యాలు, రచనలు అందుకు తోడ్పడతాయి. సామాజిక న్యాయం కోసం పోరాడే వారికి సాధనాలవుతాయి. 
- వి.శ్రీనివాసరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి